Friday, 30 December 2016

యంగ్ హీరోతో నాగ్ మల్టీ స్టారర్

యంగ్ హీరోతో నాగ్ మల్టీ స్టారర్



సీనియర్ హీరోల్లో ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే స్టార్ కింగ్ నాగార్జున. రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ నుంచి భక్తిరస చిత్రాల వరకు.. ఇప్పటికీ అన్ని రకాల పాత్రల్లో అలరిస్తున్న నాగార్జున, యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలో కొన్ని సినిమాలో గెస్ట్ అపియరెన్స్ లు ఇచ్చిన ఈ మన్మథుడు.. ఇప్పుడు ఓ సక్సెస్ ఫుల్ యంగ్ హీరోతో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడట.

ప్రస్తుతం టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నయంగ్ హీరో నిఖిల్. స్వామిరారా, కార్తీకేయ, ఎక్కడికీపోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో డిఫరెంట్ జానర్ లో దూసుకుపోతున్న ఈ యువ కథానాయకుడు సీనియర్ స్టార్ నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడట. నిఖిల్ హీరోగా కార్తీకేయ సినిమాను తెరకెక్కించిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Wednesday, 28 December 2016

మనటీవీలో ఐఐటీ, నీట్‌, ఎంసెట్‌ శిక్షణ ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ల్లోనూ అందుబాటులోకి వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

మనటీవీలో ఐఐటీ, నీట్‌, ఎంసెట్‌ శిక్షణ 
ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ల్లోనూ అందుబాటులోకి 
వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కేటీఆర్‌ 



ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల గ్రూప్‌-2 పరీక్షల శిక్షణకు వచ్చిన అనూహ్య స్పందన దృష్ట్యా ఐఐటీ, నీట్‌, ఎంసెట్‌లకు కూడా మనటీవీ(సాఫ్ట్‌నెట్‌) ద్వారా శిక్షణివ్వాలని తెలంగాణ ఐటీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 2 నుంచి మనటీవీ-1, మనటీవీ-2 ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఆరంభించబోతోంది. సాఫ్ట్‌నెట్‌ వెబ్‌సైట్‌ను ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్యతో కలసి ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం ఆరంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాంకేతికతను వాడుకొని పేదప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన, ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మనటీవీ ద్వారా గ్రూప్‌-2 శిక్షణిస్తే... వాటిని సుమారు 30లక్షల మంది యూట్యూబ్‌ ద్వారా చూడగా, 20వేల మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారన్నారు. ఆ స్ఫూర్తితోనే నీట్‌, ఐఐటీ, ఎంసెట్‌లకు ఉపయోగపడే పాఠాలు తయారు చేశామని, చుక్కారామయ్య మార్గదర్శనంలో సాగుతున్న ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేటులో అందిస్తున్న శిక్షణను ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ అందిస్తే వారూ ఎందులోనూ తీసిపోరని అన్నారు. సాంకేతికత తెలిసిన వారు మంత్రులైతే కలిగే ప్రయోజనాలు మంత్రి కేటీఆర్‌ను చూస్తే అర్థమవుతున్నాయని చుక్కా రామయ్య అన్నారు. ప్రపంచ మార్కెట్‌ను అందుకోవాలంటే సాంకేతికత ఆధారంగా విద్యాబోధన జరగాలని, ఈ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఆయన ప్రశంసించారు.

జనవరి 2 నుంచి రోజూ 6 గంటలు తరగతులు 
ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా సుమారు 540 గంటల పాఠ్యాంశాలను తయారు చేశారు. మనటీవీ(సాఫ్ట్‌నెట్‌)లో జనవరి రెండో తేదీ నుంచి మేలో ఎంసెట్‌ పూర్తయ్యేదాకా ప్రసారం చేస్తారు. రోజూ ఉదయం 6 నుంచి 9 గంటలవరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు శిక్షణ ఉంటుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన ఐదు సబ్జెక్టులకు చెందిన 52 మంది నిపుణులతో డిజిటల్‌ బోర్డులు, దృశ్యాత్మక ప్రదర్శన(పవర్‌ పాయింట్‌ ప్రజెంటేన్‌)ల సాయంతో ఈ పాఠాలు బోధిస్తారు. ఇతర పరీక్షలను దృష్టిలో ఉంచుకొని జనవరిలో 30 రోజులు, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 15 రోజులు, ఏప్రిల్‌లో 20 రోజుల పాటు పాఠాలను ప్రసారం చేస్తామని మనటీవీ సీఈవో శైలేశ్‌రెడ్డి తెలిపారు. మనటీవీ-1లో ప్రతిరోజూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయ్యే పాఠ్యాంశాలను మరుసటి రోజు మనటీవీ-2లో పునఃప్రసారం చేస్తామన్నారు. ఈ పాఠాలనే సాఫ్ట్‌నెట్‌లో భాగమైన మనటీవీ యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ల్లో కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. మొబైల్‌ ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్న ప్రతి విద్యార్థీ మనటీవీ శిక్షణ కార్యక్రమాలను వీక్షించవచ్చని శైలేశ్‌ చెప్పారు. 

డిజిటల్‌ లావాదేవీలు భారం కారాదు నగదు లావాదేవీలకన్నా చౌకగా ఉండాలి అప్పుడే ప్రజలు ఆసక్తి చూపుతారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ సేవా పన్ను మినహాయింపు కొనసాగించాలని సిఫార్సు చేస్తామని వెల్లడి జనవరి మొదటివారంలో ప్రధానికి మధ్యంతర నివేదిక ఈనాడు - దిల్లీ


డిజిటల్‌ లావాదేవీలు భారం కారాదు 
నగదు లావాదేవీలకన్నా చౌకగా ఉండాలి 
అప్పుడే ప్రజలు ఆసక్తి చూపుతారు 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ 
సేవా పన్ను మినహాయింపు కొనసాగించాలని సిఫార్సు చేస్తామని వెల్లడి 
జనవరి మొదటివారంలో ప్రధానికి మధ్యంతర నివేదిక 
ఈనాడు - దిల్లీ 



డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వైపు భారత్‌ అడుగులు వేగమయ్యాయి. ఆ దిశగా ముఖ్యమంత్రుల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. కమిటీ నివేదిక తుదిరూపు దిద్దుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి తొలివారంలో మధ్యంతర నివేదికను ప్రధాని నరేంద్రమోదీకి అందజేస్తామని కమిటీ కన్వీనర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అనంతరం నివేదికను వెబ్‌సైట్లలో పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తామని, వారి నుంచి వచ్చే సూచనలు, సలహాలను అనుసరించి కార్యాచరణ ప్రణాళిక, తుది నివేదిక రూపొందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్‌ సభ్యులు, నిపుణులతో కూడిన ఈ సంఘం బుధవారం సమావేశమయింది. అనంతరం చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు. నగదు లావాదేవీల కంటే డిజిటల్‌ లావాదేవీల్లో లాభాలు ఉంటేనే ప్రజల ఆలోచన ధోరణి మారుతుందని చంద్రబాబు చెప్పారు. ఈ దిశగా ఉపకమిటీ, నీతిఆయోగ్‌, నిపుణులు, అధికారులు అధ్యయనం చేశారని, ఈ మేరకు సమావేశంలో పలు సూచనలు వచ్చాయని తెలిపారు. ‘‘డిజిటిల్‌ చెల్లింపులపై సేవా పన్ను మినహాయింపును డిసెంబరు 31 తర్వాతే కాదు, మార్చి31 తర్వాత, భవిష్యత్తులోనూ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలనుకుంటున్నాం. నగదుతో చేసే లావాదేవీలకన్నా డిజిటిల్‌ లావాదేవీలకు ఖర్చు ఎక్కువయితే ప్రజలు నగదువైపే ఆసక్తి చూపిస్తారు.’’ అని చెప్పారు. డిజిటల్‌ లావాదేవీలతో పారదర్శకత పెరుగుతుందని, అవినీతి, నల్లధనం నిర్మూలనకు డిజిటల్‌ ఆర్థికవ్యవస్థ దోహదం చేస్తుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆధార్‌ అనుసంధానిత లావాదేవీలు ఉండేలా అధ్యయనం చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అదనపు మౌలిక సదుపాయాలు అవసరం లేకుండానే ప్రస్తుతం ఉన్న మౌలికసదుపాయాలతోనే డిజిటల్‌ లావాదేవీలకు వూపునిచ్చే రెండు ప్రధాన మార్గాలు- ఆధార్‌పే, మార్పులు,చేర్పులు చేసిన యూఎస్‌ఎస్‌డీ, యూపీఐలను త్వరలోనే విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఆధార్‌ అనుసంధానిత చెల్లింపుల పద్ధతిలో దుకాణదారుడికి రూ.2వేల విలువైన బయోమెట్రిక్‌ పరికరం, వినియోగదారుడికి ఆధార్‌ అనుసంధానిత బ్యాంకు ఖాతా ఉండాలన్నారు. వినియోగదారుడి వేలిముద్రతో చెల్లింపులు చేయొచ్చన్నారు. బయోమెట్రిక్‌ పరికరాన్ని రాష్ట్రంలో రూ.1000కే అందించనున్నామని చెప్పారు. రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా 400 దుకాణాల్లో బయోమెట్రిక్‌ పరికరం ఉపయోగించి నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం చుట్టామన్నారు. నగదు రహిత లావాదేవీల పెంపునకు త్వరలోనే 10 లక్షల ఈపాస్‌ యంత్రాలు, 1.8లక్షల ఎంపాస్‌ మిషన్లు దిగుమతి చేసుకోబోతున్నామని తెలిపారు. స్థానికంగా కూడా ఆధార్‌ గుర్తింపు (బయోమెట్రిక్‌) యంత్రాల తయారీ చేయనున్నామని చంద్రబాబు చెప్పారు. స్మార్ట్‌ఫోన్లకు హార్డ్‌వేర్‌ను దేశంలోనే తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అన్ని బ్యాంకులూ లావాదేవీల కోసం ఆధార్‌కార్డులతో అనుసంధానం చేసుకోవాలన్నారు.


డిజిటల్‌ లావాదేవీలకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, ఇతరత్రా అంశాలపై భద్రతాపరమైన సందేహాలు ప్రజల్లో ఉన్నాయన్నారు. కట్టుదిట్టమైన భద్రతఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొరియా, కెన్యా, యూకే, చైనావంటి దేశాల్లో డిజిటల్‌లావాదేవీలు పరిశీలించామని చెప్పారు. సహకార బ్యాంకులనుకూడా డిజిటల్‌ లావాదేవీల్లోకి తీసుకురావాలని మహారాష్ట్రవంటి రాష్ట్రాలు కోరుతున్నాయని ఈ అంశాన్ని ఆర్‌బీఐతో చర్చిస్తామని చంద్రబాబు తెలిపారు.
డిజిటల్‌ అంశాలపై 14444 హెల్ప్‌లైన్‌ నంబరుకి ఫోన్‌ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని, త్వరలోనే ఈ నంబరు ప్రారంభమవుతుందని నీతిఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియా తెలిపారు. సమావేశంలో సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌ చామ్లింగ్‌, నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌లు పాల్గొన్నారు. 

రద్దయిన నోట్లుంటే నేరం ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం కనీసం రూ.10వేల జరిమానా బ్యాంకుల్లో జమకు రేపటితో ముగియనున్న గడువు తగిన కారణాలు చెబితేనే ఆ తర్వాత ఆర్‌బీఐ శాఖల్లో జమ దిల్లీ

రద్దయిన నోట్లుంటే నేరం 
ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం 
కనీసం రూ.10వేల జరిమానా 
బ్యాంకుల్లో జమకు రేపటితో ముగియనున్న గడువు 
తగిన కారణాలు చెబితేనే ఆ తర్వాత ఆర్‌బీఐ శాఖల్లో జమ 
దిల్లీ 


ద్దయిన పెద్ద నోట్లు రూ.10వేలకన్నా ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటే నేరం కానుంది. ఇంత మొత్తంలో పాత పెద్ద నోట్లను బదిలీ చేసినా, స్వీకరించినా కూడా నేరంగా పరిగణిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్సును తీసుకొచ్చింది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఈ ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపింది. బ్యాంకుల్లో జమ చేయని రద్దయిన పెద్ద నోట్లను నాశనం చేయడానికి వీలు కల్పించేలా భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) చట్టాన్ని సవరించేందుకూ ఈ ఆర్డినెన్సు అవకాశం కల్పిస్తోంది. పాత రూ.500నోట్లను, రూ.1,000 నోట్లను బ్యాంకుల్లో జమ చేయడానికి విధించిన గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. ప్రత్యేకంగా పేర్కొన్న ఆర్‌బీఐ శాఖల్లో మాత్రం వచ్చే ఏడాది మార్చి 31 వరకు జమ చేయవచ్చు. ఈ నెల 30లోపు బ్యాంకుల్లో జమ చేయలేకపోయిన వారు ఆ తర్వాత ఆర్‌బీఐ శాఖల్లో జమ చేయాలంటే తగిన కారణాలను స్పష్టం చేయాల్సి ఉంటుంది. రద్దయిన పెద్ద నోట్లను మార్చి 31 తర్వాత కలిగి ఉన్నవారికే ఈ ఆర్డినెన్సు వర్తిస్తుందా లేదా ఈ నెల 30 తర్వాత కలిగి ఉన్నవారికి కూడా వర్తిస్తుందా అన్న విషయమై అధికార వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ గత నెల 8న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తులో న్యాయవివాదాలకు ఆస్కారం లేకుండా ఉండాలంటే ఈ నోటిఫికేషన్‌ ఒక్కటే సరిపోదని, సంబంధిత చట్టానికి తగిన సవరణలు అవసరమని ప్రభుత్వ వర్గాలు భావించాయి. నోటు కలిగి ఉన్న వారికి తగిన విలువ చెల్లిస్తామని నగదుపై భారత రిజర్వు బ్యాంకు పూచీ ఉంటుంది. పాత నోట్లను తిరిగి ఇవ్వడానికి తగినంత అవకాశం ఇచ్చిన తర్వాత చట్టం ద్వారా మాత్రమే ఈ పూచీ రద్దవుతుంది. వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత నిర్ధారిత సంఖ్యలో రద్దయిన నోట్లను కలిగి ఉన్నవారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించాలని కేంద్ర మంత్రివర్గానికి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపిందో లేదో స్పష్టత లేదు. ఆ ఆర్డినెన్సును రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాతే అమల్లోకి వస్తుంది. ఆర్డినెన్సు జారీ అయిన ఆరు నెలల్లోగా పార్లమెంట్‌ అమోదంతో చట్టంగా మార్చాల్సి ఉంటుంది. రూ.15.4 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లను గత నెల 8న రద్దు చేయగా దాదాపు రూ.14 లక్షల కోట్లను బ్యాంకుల్లో జమ చేయడమో, మార్చుకోవడమో జరిగింది.

రుణాలు చెల్లించడానికి మరో నెల గడువు 
ముంబయి: పెద్దనోట్ల రద్దు నిర్ణయం వివిధ రంగాలపై చూపిన ప్రభావం నేపథ్యంలో బ్యాంకుల రుణ గ్రహీతలకు మరో నెల రోజుల గడువునివ్వాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) నిర్ణయించింది. ఇంతకు ముందు 60 రోజుల అదనపు గడువునివ్వగా తాజాగా మరో 30 (మొత్తం 90) రోజులు ఇచ్చింది. రూ.కోటి లోపు గృహ, కారు, వ్యవసాయ, ఇతర రుణాలకు ఇది వర్తిస్తుంది. రుణాన్ని నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా వర్గీకరించకుండా ఈ వ్యవధి వెసులుబాటు కల్పిస్తుందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. నవంబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్య కట్టాల్సిన బకాయిలకు ఇది వర్తిస్తుందని వివరించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత చెక్కులను క్లియర్‌ చేయడంతో సహా సాధారణ బ్యాంకు కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. నగదు ఉపసంహరణపై ఆంక్షల కారణంగా చాలామంది రుణ వాయిదాలను చెల్లించలేకపోతున్నారు. 

Tuesday, 27 December 2016

క్రికెట్‌లో 117ఏళ్ల రికార్డు బద్దలు రంజీలో ఒడిశాపై సమిత్‌ 359 నాటౌట్‌

క్రికెట్‌లో 117ఏళ్ల రికార్డు బద్దలు 
రంజీలో ఒడిశాపై సమిత్‌ 359 నాటౌట్‌ 
జైపుర్‌: ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 117 ఏళ్ల రికార్డు బద్దలు చేశాడు గుజరాత్‌ యువ క్రికెటర్‌ సమిత్‌. రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ ఓపెనర్‌ సమిత్‌ గోహెల్‌ 359 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వ్యక్తిగత ఓవర్‌నైట్‌ స్కోరు 261తో ఐదో రోజు, మంగళవారం ఇన్నింగ్స్‌ ఆరంభించిన అతడు 359 పరుగులతో రాణించి గుజరాత్‌కు 706 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందించాడు.ఈ భారీ ఇన్నింగ్స్‌లో సమిత్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా ఘనత అందుకొన్నాడు. గతంలో 1899లో అంటే 117 ఏళ్ల క్రితం సోమర్‌సెట్‌పై సర్రే జట్టు బ్యాట్స్‌మన్‌ బాబీ అబెల్‌ నెలకొల్పిన 357 పరుగుల రికార్డు సమిత్‌ దెబ్బకు కనుమరుగైంది. ఈ సీజన్‌లో త్రిశతకం సాధించిన ఐదో ఆటగాడిగా సమిత్‌ రికార్డు నెలకొల్పాడు.