Wednesday, 28 December 2016

డిజిటల్‌ లావాదేవీలు భారం కారాదు నగదు లావాదేవీలకన్నా చౌకగా ఉండాలి అప్పుడే ప్రజలు ఆసక్తి చూపుతారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ సేవా పన్ను మినహాయింపు కొనసాగించాలని సిఫార్సు చేస్తామని వెల్లడి జనవరి మొదటివారంలో ప్రధానికి మధ్యంతర నివేదిక ఈనాడు - దిల్లీ


డిజిటల్‌ లావాదేవీలు భారం కారాదు 
నగదు లావాదేవీలకన్నా చౌకగా ఉండాలి 
అప్పుడే ప్రజలు ఆసక్తి చూపుతారు 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ 
సేవా పన్ను మినహాయింపు కొనసాగించాలని సిఫార్సు చేస్తామని వెల్లడి 
జనవరి మొదటివారంలో ప్రధానికి మధ్యంతర నివేదిక 
ఈనాడు - దిల్లీ 



డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వైపు భారత్‌ అడుగులు వేగమయ్యాయి. ఆ దిశగా ముఖ్యమంత్రుల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. కమిటీ నివేదిక తుదిరూపు దిద్దుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి తొలివారంలో మధ్యంతర నివేదికను ప్రధాని నరేంద్రమోదీకి అందజేస్తామని కమిటీ కన్వీనర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అనంతరం నివేదికను వెబ్‌సైట్లలో పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తామని, వారి నుంచి వచ్చే సూచనలు, సలహాలను అనుసరించి కార్యాచరణ ప్రణాళిక, తుది నివేదిక రూపొందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్‌ సభ్యులు, నిపుణులతో కూడిన ఈ సంఘం బుధవారం సమావేశమయింది. అనంతరం చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు. నగదు లావాదేవీల కంటే డిజిటల్‌ లావాదేవీల్లో లాభాలు ఉంటేనే ప్రజల ఆలోచన ధోరణి మారుతుందని చంద్రబాబు చెప్పారు. ఈ దిశగా ఉపకమిటీ, నీతిఆయోగ్‌, నిపుణులు, అధికారులు అధ్యయనం చేశారని, ఈ మేరకు సమావేశంలో పలు సూచనలు వచ్చాయని తెలిపారు. ‘‘డిజిటిల్‌ చెల్లింపులపై సేవా పన్ను మినహాయింపును డిసెంబరు 31 తర్వాతే కాదు, మార్చి31 తర్వాత, భవిష్యత్తులోనూ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలనుకుంటున్నాం. నగదుతో చేసే లావాదేవీలకన్నా డిజిటిల్‌ లావాదేవీలకు ఖర్చు ఎక్కువయితే ప్రజలు నగదువైపే ఆసక్తి చూపిస్తారు.’’ అని చెప్పారు. డిజిటల్‌ లావాదేవీలతో పారదర్శకత పెరుగుతుందని, అవినీతి, నల్లధనం నిర్మూలనకు డిజిటల్‌ ఆర్థికవ్యవస్థ దోహదం చేస్తుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆధార్‌ అనుసంధానిత లావాదేవీలు ఉండేలా అధ్యయనం చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అదనపు మౌలిక సదుపాయాలు అవసరం లేకుండానే ప్రస్తుతం ఉన్న మౌలికసదుపాయాలతోనే డిజిటల్‌ లావాదేవీలకు వూపునిచ్చే రెండు ప్రధాన మార్గాలు- ఆధార్‌పే, మార్పులు,చేర్పులు చేసిన యూఎస్‌ఎస్‌డీ, యూపీఐలను త్వరలోనే విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఆధార్‌ అనుసంధానిత చెల్లింపుల పద్ధతిలో దుకాణదారుడికి రూ.2వేల విలువైన బయోమెట్రిక్‌ పరికరం, వినియోగదారుడికి ఆధార్‌ అనుసంధానిత బ్యాంకు ఖాతా ఉండాలన్నారు. వినియోగదారుడి వేలిముద్రతో చెల్లింపులు చేయొచ్చన్నారు. బయోమెట్రిక్‌ పరికరాన్ని రాష్ట్రంలో రూ.1000కే అందించనున్నామని చెప్పారు. రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా 400 దుకాణాల్లో బయోమెట్రిక్‌ పరికరం ఉపయోగించి నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం చుట్టామన్నారు. నగదు రహిత లావాదేవీల పెంపునకు త్వరలోనే 10 లక్షల ఈపాస్‌ యంత్రాలు, 1.8లక్షల ఎంపాస్‌ మిషన్లు దిగుమతి చేసుకోబోతున్నామని తెలిపారు. స్థానికంగా కూడా ఆధార్‌ గుర్తింపు (బయోమెట్రిక్‌) యంత్రాల తయారీ చేయనున్నామని చంద్రబాబు చెప్పారు. స్మార్ట్‌ఫోన్లకు హార్డ్‌వేర్‌ను దేశంలోనే తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అన్ని బ్యాంకులూ లావాదేవీల కోసం ఆధార్‌కార్డులతో అనుసంధానం చేసుకోవాలన్నారు.


డిజిటల్‌ లావాదేవీలకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, ఇతరత్రా అంశాలపై భద్రతాపరమైన సందేహాలు ప్రజల్లో ఉన్నాయన్నారు. కట్టుదిట్టమైన భద్రతఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొరియా, కెన్యా, యూకే, చైనావంటి దేశాల్లో డిజిటల్‌లావాదేవీలు పరిశీలించామని చెప్పారు. సహకార బ్యాంకులనుకూడా డిజిటల్‌ లావాదేవీల్లోకి తీసుకురావాలని మహారాష్ట్రవంటి రాష్ట్రాలు కోరుతున్నాయని ఈ అంశాన్ని ఆర్‌బీఐతో చర్చిస్తామని చంద్రబాబు తెలిపారు.
డిజిటల్‌ అంశాలపై 14444 హెల్ప్‌లైన్‌ నంబరుకి ఫోన్‌ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని, త్వరలోనే ఈ నంబరు ప్రారంభమవుతుందని నీతిఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియా తెలిపారు. సమావేశంలో సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌ చామ్లింగ్‌, నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌లు పాల్గొన్నారు. 

డిజిటల్‌ లావాదేవీలు భారం కారాదు నగదు లావాదేవీలకన్నా చౌకగా ఉండాలి అప్పుడే ప్రజలు ఆసక్తి చూపుతారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ సేవా పన్ను మినహాయింపు కొనసాగించాలని సిఫార్సు చేస్తామని వెల్లడి జనవరి మొదటివారంలో ప్రధానికి మధ్యంతర నివేదిక ఈనాడు - దిల్లీ
4/ 5
Oleh